రేపు అయోధ్య తీర్పు…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ఢిల్లీ, నవంబర్ 8: నెల రోజులు తక్కువ ఇరువై ఏడు సంవత్సరాలుగా ఉత్కంఠ రేపుతున్న అయోధ్య భూ వివాదంపై ఎట్టకేలకు రేపు అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం 10.30 గంటలకు తీర్పు వస్తుందని అందరూ భావిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో రంజన్ గొగోయ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయనున్నారు. ఈలోపే అత్యంత ముఖ్యమైన అయోధ్య తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే మునుపెన్నడూ లేనంత వేగంగా కొన్ని రోజులుగా ఇరుపక్షాల వాదనలు వినడం పూర్తి చేసి అంతిమ తీర్పుకు కసరత్తులు చేశారు. కాగా, అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలోని సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఒక్క అయోధ్యలో భద్రత కోసమే నాలుగు వేల మంది పారామిలిటరీ సిబ్బందిని తరలించారు. ఇవాళ ఉదయం నుంచే యూపీ సర్కారు కదలికలు అయోధ్య తీర్పు వేగిరమే వస్తుందన్న అంచనాలను బలపరిచాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో యూపీ ఉన్నతాధికారులు ఆయన చాంబర్ లోనే భేటీ అయ్యారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే తీర్పు ఏలా ఉన్నా స్వీకరించాలని అన్ని వర్గాల ప్రజలను సంసిద్ధం చేసేందుకు పోలీసు అధికారులు శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి సంయమనం పాటించాలని కోరారు. అలాగే సోషల్ మీడియా లో తీర్పు విషయంలో ఏలాంటి రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఎవరైనా సోషల్ మీడియా లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు అధికారులు హెచ్చరించారు. మొత్తానికి రెండు దశాబ్దాలకుపైగా ఉత్కంఠ రేపు తున్న అయోధ్య భూ వివాదం తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుంది.