మావోల చేతిలో ఎంపిటిసి హతం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 12: మూడు రోజుల క్రితం మావోయిస్టులు కిడ్నాప్ చేసిన చర్ల మండలం టీఆర్ఎస్ నేత, పెద్దమిడిసిలేరు ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును హతమార్చారు. ఆయన మృతదేహాన్ని ఎర్రంపాడు-పుట్టపాడు మార్గ మధ్యం లో వదిలి వెళ్ళడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలంలో మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కార్యదర్శి శారద పేరిట ఓ లేఖ లభించింది. పోడు భూములను గుంజుకోవడంతో పాటు పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తుండటం వల్ల ఆయనను హత్య చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనను జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఖండించారు. మూడు రోజుల క్రితం చర్ల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నల్లూరి శ్రీనివాస్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి హతమార్చటం హేయమైన చర్య అని పేర్కొన్నారు. శ్రీనివాస్ పోలీస్ ఇన్ఫార్మర్ కాదని, పోలీసులతో అతనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్ తన ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల ఉన్న రైతులకు సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న రైతు అని తెలిపారు. ఒక మంచి రైతును దారుణంగా కొట్టి హతమార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. మావోయిస్టులు తమ మనుగడ కోసం చర్ల ఏరియాకి సంబంధించిన రైతులు, వ్యాపారస్తులను డబ్బుల కోసం వేధిస్తూ, రైతులకు అండగా నిలిచే ఇలాంటి వ్యక్తులను టార్గెట్ చేసి వారిని చంపుతూ ప్రజలలో భయాందోళనలను సృష్టిస్తున్నారని అన్నారు. ఎంతో మంది కాంట్రాక్టర్లను, రైతులను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఇలాంటి కార్యకలాపాలకు మావోయిస్టులు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విధమైన సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే మావోయిస్టులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.