నిశ్శబ్దం చెదురుతోందా…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 5: నిన్నటిమొన్నటి వరకు అధికార తెరాస పార్టీలో కొనసాగిన నిశ్శబ్ద వాతావరణం మెల్లమెల్లగా చెదురుతుందా? అంటే ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. మొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఒక కుదుపు కుదిపేయడం, ఆ తరువాత మంత్రి రాజేందర్ కు బీసీ సంఘాలు మద్దతుగా నిలవడం, కొన్ని గంటల తరువాత మంత్రి రాజేందర్ సవరణ ప్రకటన విడుదల చేయడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజేందర్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు అస్త్రంగా వాడుకుంటూ టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పై విమర్శలు కూడా సంధించాయి. ఆ తరువాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ బాస్ కేసీఆర్ అంటూనే రాజేందర్ మంత్రి పదవికి ఏలాంటి ముప్పు లేదంటూ ముక్తాయింపు ఇచ్చారు. ఆ తరువాత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు కూడా రాజేందర్ వ్యాఖ్యలను సమర్థించారు. ఇదిలా ఉండగా, బుధవారం జరిగిన పార్టీ సభ్యత్వ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలోని కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఎవరి పేరును ప్రస్తావించకుండానే పార్టీతోనే పదవులు వచ్చాయన్న సంగతి మర్చిపోవద్దంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా, తాజాగా మరో ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మరింతగా రాజేసేలా కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ అడిటోరియంలో గురువారం జరిగిన టీచర్స్ డే వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ కు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పలు వార్తలు షికార్లు చేస్తున్న క్రమంలో ఈటెల రాజేందర్ కు, తనకు నిజాలు మాట్లాడటమే వచ్చునంటూ మాట్లాడుకొచ్చాన బాలకిషన్ తాము కడుపులో ఏమీ దాచుకోమని..ఉద్యమంలో కొట్లాడినోళ్లమని..తమకు అబద్దాలు రావంటూ రసమయి మాట్లాడుతుండగా..మధ్యలో కల్పించుకున్న ఈటెల నవ్వుతూ జాగ్రత్తగా మాట్లాడు అంటూ సూచించారు. ఏమీ కాదన్నా అనుకుంటూనే రసమయి బాలకిషన్ తనదైన శైలిలో ప్రసంగం కొనసాగించారు. ఆ తర్వాత మాట్లాడిన ఈటెల..రసమయికి కాస్త స్వేచ్ఛెక్కువ అని..అయితే రసమయి మాటలతో తాను ఏకీభవిస్తానంటూ మళ్ళీ ఈటెల చెప్పుకువచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరి మాటలు ఆ పార్టీలో సంచలనంగా మారాయి. అయితే, మొన్న ఈటెల, నేడు రసమయి, రేపు మరేవరో…అన్న చర్చ ప్రస్తుతం అందరిలో ఆసక్తి రేపుతుండగా, ఈ పరిణామాలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. మొత్తానికి పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సద్దుమణిగేందుకు గులాబీ బాస్ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ? ఆ నిర్ణయం ఏలా ఉండబోనుంది ? అనే దానిపై మాత్రం ఇటు టీఆర్ఎస్ శ్రేణుల్లో, అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపు తోంది. మరీ వేచిచూడాల్సిందే.