JMS News Today

For Complete News

ఈసారి భిన్నంగా….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, నవంబర్ 12: సాధారణంగా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ఉంటాయి. కానీ దానికి భిన్నంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ తీరుపై జంగ్ సైరన్ మోగించింది. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రైతు పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం ధర్నా చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ యాసంగిలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కారమయ్యేవరకు విశ్రమించబోమని, పోరాడుతామని హెచ్చరించారు. కేంద్రం తెలంగాణపై వివక్ష మానుకోవాలని, పంజాబ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్, గంగాధర మండల కేంద్రంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో మంత్రి గంగుల మాట్లాడారు. తెలంగాణ పచ్చగా ఉండడాన్ని కేంద్రంలోని బిజెపి పాలకులు చూడలేక పోతున్నారని మండిపడ్ఠారు. అధికారంలో ఉన్న పార్టీని రోడ్లపైకి తీసుకువచ్చారని విమర్శించారు.
స్వయం పాలనలో రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు రొడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని,
రాజ్యాంగంలో వ్యవసాయ చట్టాలు రాష్ట్రాల చేతుల్లో కాకుండా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారని ఆరోపించారు. మద్దతు ధరతో పాటు ధాన్యం కొనుగోలు, వాటిని నిల్వ చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు, వాటిని నిల్వ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని,
కేవలం రైతుల వ్యవసాయానికి కావల్సిన సాగునీరు, విద్యుత్తు, ఎరువులు, విత్తనాలు లాంటి సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని వివరించారు. కాళేశ్వరం జలాలు, 24 గంటల కరెంట్, రైతు పెట్టుబడి, కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండడంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగి బీడు భూములు లేకుండా పోయాయని అన్నారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి బియ్యంగా మార్చి ఢిల్లీకి పంపిస్తున్నామని, ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వమే నేరుగా రైతుల వద్దనుండి ధాన్యాన్ని కొనుగోలు చేసేదని, కానీ ఇప్పుడు ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని రాజ్యాంగం హక్కును కల్పించిందని, ప్రతి ధాన్యం గింజను కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఇప్పుడు యాసంగి పంటను కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని,
ధాన్యం కొనుగోలు పై మంత్రి కెటిఆర్ తో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ ను కలిశామని వివరించారు.
రైతులకు షరతులు పెట్టొద్దని విజ్ఞప్తి చేశామని, కానీ వానాకాలం పంటను కొనుగోలు చేస్తామని, యాసంగి పంటను కొనుగోలు చేయమని చెబుతుందని, దీనిపై సిఎం కెసిఆర్ సైతం కేంద్ర ప్రభుత్వంతో చర్చించినా,వారి నుండి స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోపముంటే మాపై చూపించండి.. రైతుల పై కాదని కోరారు. పంజాబ్ లో పండిన ప్రతిధాన్యం గింజను కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసే వరకు రైతు పక్షాన నిలబడతామని, బేషరతుగా తెలంగాణ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇళ్ళను ముట్టడించి ధర్నా చేస్తామని, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని మంత్రి గంగుల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మేయర్ సునీల్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *