అసలేం జరుగుతోంది….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 31: తెరాస అంటే నిశ్శబ్దం.. ఆ నిశ్శబ్దం ఇప్పుడు బద్ధలవుతుందా..? అంటే అలానే అనిపిస్తోంది. పార్టీలో ఎవరూ కూడా పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడని పరిస్థితులుండగా, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ చేసిన అసహన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపగా, తాజాగా మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఒక కుదుపు కుదిపేసింది. గులాబీ జెండాకు ఓనర్లం మేమే అంటూ వ్యాఖ్యానించడం పెద్ద కలకలమే రేపింది. అయితే, కొన్ని గంటల్లోనే మంత్రి సవరణ వ్యాఖ్యలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో అధికార తెరాసలో ఏం జరుగుతోందన్న అంశం ఇటు రాజకీయ వర్గాల్లో, అటు ప్రజల్లో ఉత్కంఠ, ఆసక్తి రేపుతోంది. మంత్రివర్గ విస్తరణ, పునర్వ్ వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం గత కొంతకాలంగా కొనసాగుతుండటం, ఎవరూ ఇన్, ఎవరూ అవుట్, ఎవరూ డౌట్ అంటూ పలు పత్రికల్లో కథనాలు, సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తనదైన శైలిలో ముందుకు వెళ్తూ…మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. తొలి మంత్రివర్గంలో ఆటు కొడుకు కేటీఆర్ కు, ఇటు మేనల్లుడు హరీష్ రావు కు ఆవకాశం ఇవ్వలేదు. కొడుకు కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన కేసీఆర్ హరీష్ రావు కు ఏ ఆవకాశం ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే హరీష్ ప్రాధాన్యతను తగ్గించారన్న వాదనలు అప్పట్లో బలంగా వినిపించిన సంగతి కూడా తెలిసిందే. హరీష్ అభిమానులైతే సోషల్ మీడియా లో మా నేతను తొక్కేస్తున్నారంటూ వాపోతూ… రకరకాల కామెంట్లు పెట్టడం, అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం విదితమే. ఇదేకాక టీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యక్రమం జరిగిన హరీష్ ఎక్కడ అని ఆరా తీసేవాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా అయితే సోషల్ మీడియాలో ఏలా వైరల్ అయ్యయో కూడా అందరికీ తెలిసిందే. అయితే, వీటిని హరీష్ మాత్రం పట్టించుకోకపోగా, కేసీఆరే మా నేత, ఆయన నాయకత్వంలోనే అభివృద్ధి అంటూ మాట్లాడిన సందర్భాలున్నాయి. ఇదిలా ఉంటే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. కుల సామాజిక సమీకరణల మేరకు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. ఈసారి మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఈసారి కేటిఆర్ కు మంత్రి పదవి ఖాయమని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. హరీష్ పేరు అంతగా వినిపించలేదు. దీంతో హరీష్ కు మంత్రి పదవి లేనట్లేనా? అన్న చర్చ జరిగింది. ఈ క్రమంలో, అనూహ్యంగా మంత్రి ఈటల రాజేందర్ పై వ్యతిరేక కథనాలు రెండు పత్రికల్లో ప్రధానంగా ప్రచురితమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలను లీక్ చేశారంటూ, దీనిపై కేసీఆర్ అగ్రహాంగా ఉన్నారంటూ, ఆయన మంత్రి పదవి అవుట్ అంటూ ఇలా రకరకాల కథనాలు వెలువడిన నేపద్యంలో మంత్రి రాజేందర్ సంయమనం పాటించాలని, వాటిపై ఎవరూ స్పందించ వద్దంటూ అభిమానులు, పార్టీ శ్రేణులకు ట్విట్టర్లో సూచించారు. అయితే, గురువారం హుజూరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు పార్టీని ఒక కుదుపు కుదిపేసిందని చెప్పవచ్చు. ఆ వ్యాఖ్యలు జెట్ స్పీడ్ వేగంతో జనాల్లోకి వెళ్ళిపోయాయి. ఎక్కడ చూసినా అదే చర్చ వినిపించింది. బీసీ సంఘాలు కూడా ఆయనకు మద్దతుగా ప్రకటనలు చేేేశాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ రాజేందర్ కొన్ని గంటల వ్యవధిలోనే యూ టర్న్ తీసుకోవడం జరిగింది. నేను గులాబీ సైనికుడిని, మా బాస్ కేసీఆర్ అంటూ రాజేందర్ ప్రకటన విడుదల చేశారు. ఎప్పుడూ ఎవరూ మాట్లాడే పరిస్థితి లేని టీఆర్ఎస్ పార్టీలో నేతలు చేస్తున్న వ్యాఖ్యల దరిమిలా అసలు పార్టీ లో ఏమి జరుగుతుందన్న అంశం ప్రస్తుతం అందరిలో ఆసక్తి రేపు తోంది. అయితే, ఏవరేమనుకున్న తన నిర్ణయమే అల్టిమేట్ అన్నట్టుగా వ్యవహరించే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండబోతోందన్న దానిపై కూడా చర్చ జోరుగా జరుగుతోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో ఏమి జరుగుతుంది ? ఎవరూ ఇన్ ? ఎవరూ ఔట్ ?ఎవరూ డౌట్ ? వేచి చూడాల్సిందే మరీ.