వారి తప్పిదం వల్లే ఇలా….?
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 9: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడటానికి కరీంనగర్ మున్సిపల్ అధికారులే కారణమని టిఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకుడు మేడి మహేష్ ఆరోపించారు. ఓటరు జాబితాలో అవకతవకలు జరగడం వల్లనే కొందరు హైకోర్టును ఆశ్రయించారని, దీని వల్ల మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేష్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో 2001లో జనాభా ఎంత ఉంది ? ఇప్పుడు ఎంత ఉంది ? ఈ మధ్య కాలంలో ఓట్లు ఎన్ని ? గ్రామాల విలీనం తర్వాత ఎస్సీ జనాభా ఎంత ? జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించారా ? అని ప్రశ్నించారు. అధికారులు ఎందుకు ఎస్సీ జనాభా తక్కువ చేసి చూపిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని మహేష్ డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం అధిక నిధులు తీసుకువస్తుంటే, అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పని చేయడం లేదని ఆరోపించారు. రోడ్ల మరమ్మత్తులు చేయకపోవడం, డ్రైనేజీలో ఉన్న చెత్తను తొలగించకపోవడం వల్ల రోడ్లన్నీ పాడవుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో వెంకటేష్, సదానందం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.