516 మండలాల్లో జర్నలిస్టుల పోరు బాట
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 26 : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) పిలుపు మేరకు మొదటి దఫా పోరుబాటలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. అనంతరం వారు తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించారు. రాష్ట్రంలోని మొత్తం 584 మండలాలకు గాను 516 మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగినట్లు టీయూడబ్ల్యూజే సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్ని మండలాల్లో జర్నలిస్టులు స్వచ్చందంగా, ఉత్సాహంగా పాల్గొని పోరాట స్ఫూర్తిని చాటుకోవడం అభినందనీయమన్నారు. ఇళ్ళ స్థలాలు కేటాయించి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, అందరికీ హెల్త్ కార్డులు ఇచ్చి అన్ని కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందేలా చూడాలని, 239 జీవోను సవరించి అందరికీ అక్రెడిటేషన్లు అందేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఆందోళన జరపాలన్న తమ సంఘం పిలుపు విజయవంతమైందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో రెండవ దఫా అక్టోబర్ 4న, రాష్ట్రంలోని అన్నీ ఆర్డీవో కార్యాలయాల వద్ద, మూడవ దఫా 33 జిల్లాల కలెక్టరేట్ ల ముందు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.