అన్యాయం చేస్తున్నారు….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 27: కొన్ని మీడియా సంస్థలకు, జర్నలిస్టులకు అన్యాయాన్ని చేసే విధంగా రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్ అరవింద్ కుమార్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరిపై చర్యలు చేపట్టాలని కోరుతూ గురువారం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ప్రతినిధి బృందం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పిసిఐ) ఛైర్మెన్ జస్టీస్ సి.కె.ప్రసాద్ కు వినతి పత్రాన్ని అందించింది. వివిధ కేసుల విచారణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ప్రెస్ కౌన్సిల్ కమిటీని యూనియన్ ప్రతినిధి బృందం టూరిజం ప్లాజాలో కలిసి ఛైర్మెన్ జస్టీస్ సి.కె.ప్రసాద్ వినతి పత్రాన్ని అందించింది. రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలను కమీషనర్ టార్గెట్ చేసి ఉద్దేశ పూర్వకంగా వారిని ఇబ్బంది పెడుతున్నట్లు యూనియన్ ప్రతినిధి బృందం ఆరోపించింది. రాష్ట్ర శాసన సభ సెక్రెటెరియట్ గుర్తింపు పొందిన మీడియా సంస్థలను సైతం కమీషనర్ బేఖాతర్ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎంప్యానెల్ మెంట్ కు పూర్తి అర్హతలు కలిగి ఉన్న పలు పత్రికలను ఆ జాబితాలో చేర్చేందుకు కమీషనర్ తిరస్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. అలాగే అక్రెడిటేషన్ నియమ నిబంధనల ప్రకారం ఎంప్యానెల్ మెంట్ లేకున్నా, ఆరు నెలలు పూర్తయిన మీడియా సంస్థలు అక్రెడిటేషన్ కార్డులకు అర్హులైనప్పటికీ, సమాచార శాఖ అధికారులు దానిని అమలు చేయడం లేదని ప్రతినిధి బృందం పేర్కొంది. కమీషనరు వైఖరిపై స్పందించి జర్నలిస్టులకు న్యాయం చేకూర్చాలని ఐజేయు, టీయుడబ్ల్యుజె నాయకులు విజ్ఞప్తి చేసారు. పిసిఐ ఛైర్మెన్ ను కలిసిన వారిలో ఐజేయూ అధ్యక్షులు దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎం.ఏ.మాజీద్, పిసిఐ మాజీ సభ్యులు అమర్ నాథ్, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తదితరులు ఉన్నారు. కాగా, టీయుడబ్ల్యుజె అందించిన వినతి పత్రంపై జస్టిస్ సి.కె.ప్రసాద్ స్పందిస్తూ, అర్హత కలిగివున్న పత్రికలకు ఎంప్యానెల్ మెంట్, అక్రెడిటేషన్లు, అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో సమాచార శాఖ వివక్ష చూపడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ విషయమై తాను తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.