దుండగులను కఠినంగా శిక్షించాలి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 28: ములుగు జిల్లా ఏటూరు నాగారంలో వాస్తవాలను బహిర్గతం చేసిన ఓ దినపత్రిక విలేఖరి గంపల శివపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన ఘటనను ఐజేయు అధ్యక్షులు దేవులపల్లి అమర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) సలహాదారులు కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలు రమేష్ , టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరు కరుణాకర్ , కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్ష ,కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, జానంపేట మారుతి స్వామి, నేషనల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు విజయ సింహరావు, ఎలగందుల రవీందర్, ఆంజనేయులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు. సమాజంలో అవినీతిని వెలికితీయడం విలేకరి వృత్తి ధర్మం లో భాగమని, ఇందులో భాగంగానే విలేఖరి శివ ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలను వెలికి తీసినట్లు వారు స్పష్టం చేశారు. ఆధారాలతో అతను రాసిన కథనంలో వాస్తవం ఉన్నందువల్లే సదరు ఫీల్డ్ అసిస్టెంట్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఆ కథనాన్ని జీర్ణించుకోలేకే, కక్ష్యసాధింపుతోనే అక్రమార్కులు శివపై హత్యాయత్నానికి పాల్పడినట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ పాశవిక ఘటనపై స్పందించి దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పగడ్బంధి చర్యలు చేపట్టాలని వారు సూచించారు.