కితాబునిస్తూనే…ఇంత వివక్షనా…?
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా వ్యాధి కట్టడి కోసం వైద్య ఆరోగ్య, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఉద్యోగులతో పాటు ప్రాణాలను పణంగా పెట్టి జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల పాత్రను గుర్తిస్తూనే కితాబు ఇస్తూనే మరోవైపు వివక్షను ప్రదర్శిస్తున్నాయంటూ టీయూడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ ఒక ప్రకటన లో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణ కోసం పనిచేస్తున్న ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కానీ అందులో జర్నలిస్టులను చేర్చలేదని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు బీమా సౌకర్యాన్ని కల్పించలేేేేదని పేర్కొన్నారు. లాక్ డౌన్ ప్రకటించిన ఈ కష్టకాలంలో జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఇతర వర్గాల మాదిరిగా ఆర్థిక సహాయం అందించకుండా, నిత్యావసర వస్తువులు సరఫరా చేయకుండా సవతి తల్లి ధోరణి ప్రదర్శిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు నిత్యం ఆసుపత్రులకు, క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లి అక్కడి పరిస్థితిని, ప్రజలు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను , వ్యాధి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పడు అందరికీ చేరవేస్తున్నారని, ఈ సందర్భంలో వైద్యులతో పాటు జర్నలిస్టులు కూడా వ్యాధి బారిన పడే ప్రమాదం లేకపోలేదని తెలిపారు .జర్నలిస్టులకు ప్రభుత్వం కనీసం మాస్కులు గ్లౌజులు, శానిటైజర్లు కూడా అందించలేదని, జర్నలిస్టులు అంకితభావంతో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్న సందర్భంలో వారిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని భావిస్తున్నామని, జర్నలిస్టులకు కరోనా వ్యాధి ప్రమాదం తొలగిపోయే వరకు కనీసం ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బీమా పథకాన్ని అమలు చేయాలని, అలాగే ప్రతి జర్నలిస్టు కు నెలకు ఐదు వేల రూపాయలకు తగ్గకుండా ఆర్థిక సహాయం అందించాలని, వారు వ్యాధి బారిన పడకుండా అవసరమయ్యే అన్నింటిని సమకూర్చాలని, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ హైదరాబాదులోని జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు, మా స్కూలు తదితర సామాగ్రి అందించడాన్ని అభినందిస్తున్నామని, అయితే మీడియా అకాడమీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి జర్నలిస్టుల కోసం ఏర్పడిన సంస్థ వెంటనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు జర్నలిస్టులకు ప్రయోజనం కలిగేలా అమలు చేయాల్సిన బాధ్యత దానిపై ఉందని పేర్కొన్నారు. అలాగే జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రతి నెల ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించే విధంగా ప్రభుత్వంపై తనవంతుగా ఒత్తిడి తీసుకురావాలని మీడియా అకాడమీ పాలకవర్గాన్ని వారు ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.