పోరాటాలకు సన్నద్ధం కండి….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 28: సమిష్టి పోరాటాలతోనే తమ హక్కులు, సమస్యలను సాధించుకోవచ్చని, ఈ దిశగా జర్నలిస్టులు సన్నద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని ప్రెస్ భవన్లో జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజెయు) జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. టీయూడబ్ల్యూజే సంఘం చాలా బలంగా ఉందని చెప్పారు. ఘనమైన చరిత్ర కలిగిన టీయూడబ్ల్యూజే అవిశ్రాంతంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తుందని చెప్పారు. టిఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన విధంగా జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులను అందించాలని డిమాండ్ చేశారు. రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు కోసం వేచి చూడకుండా జిల్లా, మండల కమిటీలు ఎక్కడికక్కడ నిరసన, ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వారం రోజుల ఆందోళన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ శ్రీకారం చుట్టనుందని, త్వరలో ఆ తేదీలను ఖరారు చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో పలు తీర్మాణాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతి స్వామి, రాష్ట్ర నాయకులు మధుకర్ రెడ్డి, బల్మూరి విజయ సింహారావు, జాతీయ నాయకులు ఎలగందుల రవీందర్, ఆంజనేయులు, దాడుల వ్యతిరేక కమిటీ రాష్ట్ర కన్వీనర్ రమేష్, జిల్లా కోశాధికారి శరత్ రావు తో పాటు నాయకులు సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్, లసమక్కపల్లి సర్పంచ్ రాములు, సింగిల్ విండో డైరెక్టర్ రాజిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, ఉపాధ్యక్షుడు కరుణాకర్, రాష్ట్ర, జాతీయ నాయకులు విజయసింహారావు, రవీందర్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు సియాసత్ స్టాఫ్ రిపోర్టర్ మోయిజోద్దిన్ తదితరులను సన్మానించారు. అంతక ముందు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సమావేశం నిర్వహించారు.