ఇప్పటికైనా గుర్తించండి….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 2: కరోనా వారియర్స్ గా జర్నలిస్టులను గుర్తించి రూ.50 లక్షల భీమా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఐజెయు పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎఓ లక్ష్మారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్ మాట్లాడుతూ కరోనాను లెక్క చేయకుండా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ కరోనాపై చైతన్యవంతులను చేస్తున్న జర్నలిస్టులకు రూ.50లక్షల భీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 12 మంది జర్నలిస్టులు కరోనా కాటుకు బలైపోగా, 1100 మంది మీడియా సిబ్బందికి , 2,600 మంది వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని వివరించారు. కనీసం మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయక చర్యలు లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందించాలని, కోవిడ్ వారియర్స్ గా నిలిచిన జర్నలిస్టులకు రూ .50 లక్షల బీమా వర్తింపజేయాలని , కరోనా సోకిన జర్నలిస్టులకు కార్పోరేట్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతీ స్వామి, కోశాధికారి శరత్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహారావు, కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, దాడుల నివారణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలు రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు విజయభాస్కర్, సంయుక్త కార్యదర్శి ఎం.డి.షుకూర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యనారాయణతోపాటు జర్నలిస్టులు జగన్, ప్రభుదాస్, సురేందర్, రఘు, సదానందం, నిజామోద్దీన్, ఫోటోగ్రాఫర్లు శైలందర్ రెడ్డి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.