అవయవదానానికి ముందుకు రండి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 19: నేత్ర, అవయవ ,శరీర దానాల పట్ల ప్రజల్లో అవగాహన విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర నేత్ర అవయవ శరీర దాతల సంఘం సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అన్నారు. స్థానిక రామ్ నగర్ లోని పద్మావతి ఫంక్షన్ హాల్ లో సోమవారం నేత్ర దాత భైరవి అనంతస్వామి సంస్మరణ సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అవయవ శరీర దానాల పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలపై కూడా ఉందన్నారు. ప్రతి వ్యక్తి మరణానంతరం శరీర దానం చేసే విధంగా ప్రభుత్వం చట్టాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకరి నేత్రదానం తో మరో నలుగురికి తయారు ప్రసాదించవచ్చు అని చెప్పారు. 2008లో ప్రారంభమైన సదాశయఫౌండేషన్ గడిచిన దశాబ్దకాలంలో నేత్ర, అవయవ, శరీర దానాల పై 600కు పైగా అవగాహన సదస్సులు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఫలితంగా శరీర అవయవ దానాల కోసం స్వచ్ఛందంగా 40వేల మంది ముందుకు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. సదాశయ ఫౌండేషన్ కృషి ఫలితంగా ఇప్పటివరకు 550 మంది నేత్రదానం, 50 మంది అవయవదానం, 60 మంది శరీర దానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. శరీర , అవయవ, నేత్ర దానాల్లో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా నేత్రదాత కుమారులను అభినందిస్తూ అభినందన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగమూర్తి, బొమ్మకంటి కిషన్, బత్తిని శంకర్ గౌడ్, భీష్మా చారి, రాజ కనకయ్య, వాసుదేవ్ కుమార్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.