JMS News Today

For Complete News

ములాకత్ తో ముచ్చట…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 4: బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ అరెస్ట్ తో కరీంనగర్ లో హైటెన్షన్ నెలకొంది. బిజెపి అగ్రనేతలు సంజయ్ ని పరామర్శించడానికి
జిల్లా జైలుకు క్యూ కట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపి వివేక్ తదితరులు మంగళవారం జిల్లా జైలుకు చేరుకుని ములాకత్ ద్వారా సంజయ్ ని కలిసి పరామర్శించారు. ఈ సందర్బంగా జరిగిన సంఘటన వివరాలను సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. అనంతరం సంజయ్ కి ధైర్యాన్ని నింపిన కిషన్ రెడ్డి ఎంపీ కార్యాలయాన్ని సందర్శించారు. సంజయ్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన ధైర్యం చెప్పారు. గాయపడిన వారిని కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, వివేక్ లు కేసీఆర్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులను బెదిరిపోయే వాళ్ళం కాదన్నారు. బీజేపీ కార్యకర్తల్లారా మీకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. సంజయ్ చేసిన దీక్ష సంఘ విద్రోహ చర్యనా ? ఎందుకు విధ్వంసం చేశారని ప్రశ్నించారు. మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. కేసిఆర్ మీరు ధర్నా చౌక్ లో ధర్నా చేయవచ్చు మేము చేయవద్దా ?
హౌజ్ అరెస్ట్ లు ఎందుకు? అంటూ నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత నిర్భందం, నియంతృత్వం చూడలేదని వాపోయారు. కేసీఆర్ నిజాం తరహా పాలన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సమాజం, మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. ఇలాంటి పాలన కోసమా మనం త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకుందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ఈ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉందంటూ ధీమా వ్యక్తం చేశారు.
పోలీసులారా చట్టాన్ని కొందరికి చుట్టం చేయకండి, ప్రజా పోరాటాల మీద లక్ష్మణ రేఖ దాటకండి అని సూచించారు. ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తే వారికి ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిందని, కానీ ఇలా చెయ్యలేదని అన్నారు. ఈ సంఘటనపై అమిత్ షా కి పిర్యాదు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ
ఇప్పుడే సంజయ్ ని కలిసి వచ్చామని, నిన్న జరిగిన సంఘటన దురదృష్టం, నీచం, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు సమస్యలు వస్తే సీఎం పిలిచి మాట్లాడాలే కానీ ఆ పని చెయ్యలేదని అన్నారు. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రశాంత జీవనంలో మట్టికొట్టి అల్లకల్లోలం చేసినప్పుడు భాధ్యత గల బీజేపీ స్పందించిందని, మా అధ్యక్షుడు నిబంధనలకు, కోవిడ్ రూల్స్ కి లోబడి ఆయన కార్యాలయంలో దీక్ష చేస్తుంటే శత్రువుల మీద దాడి చేసినట్టు చేశారని మండిపడ్డారు. వాటర్ కాన్లతో నీళ్ళు కొట్టి, గాస్ కట్టర్లతో గేట్లు పగులగొట్టి విధ్వంసం సృష్టించారని, మా నాయకులు, కార్యకర్తలను గొడ్లను కొట్టినట్టు కొట్టి గాయపరిచారని పేర్కొన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం, సీఎం ఆదేశాలతో చేశారని ఆరోపించారు. 317 జీవో సవరణ చేయాలని డిమాండ్ చేశారు. అభ్యంతరాలు పరిశీలించాలని, ఈ తప్పులకు మొదటి దోషి సీఎం అంటూ పేర్కొన్నారు. రెండు జోన్లను 7 గా చేశారని, 10 జిల్లాలను 33 జిల్లాలు చేశారని, స్థానికత ఆధారంగా చేసుకొని ఉద్యోగుల పంపిణీ జరగాలని, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నా దానిని పట్టించుకోకపొతే ఎలా? అంటూ ప్రశ్నించారు. అధికారం అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారని, చట్టానికి లోబడి పని చేయాల్సిన ఐపీఎస్ లు సీఎం చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపించారు. హోమ్ గార్డ్ డ్యూటీ, కానిస్టేబుల్ డ్యూటీ, ఎస్ఐ డ్యూటీ, సీపీ డ్యూటీ అన్నీ ఆయనే చేశారని సీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీ గుర్తు పెట్టుకో ప్రభుత్వాలు శాశ్వతం కాదని సూచిస్తూ
2023 తరువాత వచ్చేది మా ప్రభుత్వమేనంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీ భాధ్యత మరచిపోయి బానిస లాగా పనిచేశారని అన్నారు. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు నియంతృత్వంగా ఉందన్నారు. సీఎం, మంత్రులు మీటింగ్స్ కి కోవిడ్ నిబందనలు వర్తించవా ? అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ చాలా ధైర్యంగా ఉన్నారని, 317 జీవో సవరణ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. వారి వెంట మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.