బడ్జెట్ ప్రవేశ పెట్టిన మహిళా మంత్రి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
డిల్లీ, జూలై 5: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో సర్వత్రా బడ్జెట్ మీద ఆసక్తి నెలకొంది. పార్లమెంటులో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని పార్రంభించారు. రక్షణ మంత్రిగా అనేక సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్న ఆమె మొట్టమొదటిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మహిళగా రికార్డులకెక్కారు. కాగా, తొలిసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనదైన ముద్ర వేశారు. బ్రిటిష్ సంప్రదాయానికి స్వస్తి చెప్తూ.. ఆమె పట్టు వస్త్రంతో తయారు చేసిన బ్యాగ్ లో బడ్జెట్ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తీసుకొచ్చారు. గతంలో బ్రిటిష్ సంప్రదాయాన్ని పాటిస్తూ బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తెచ్చేవారు. దీనికి ముగింపు పలికిన నిర్మల.. పట్టు వస్త్రానికి రాజముద్ర వేసి.. బడ్జెట్ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తీసుకొచ్చారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందుగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను కలిశారు. బడ్జెట్‌ను సమర్పించే ముందు ఆర్థికమంత్రి రాష్ట్రపతిని కలువడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బడ్జెట్ కాపీలను ఆమె రాష్ట్రపతికి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రదాన లక్ష్యమని స్పష్టం చేశారు. గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టుల సత్వర పూర్తికి కృషి చేస్తామన్నారు. మేకిన్ ఇండియాను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. భారత్‌ను మరింత ఉన్నత స్ధాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. కాలుష్య రహిత భారత్‌గా దేశాన్ని రూపొందిస్తామని అన్నారు. ఇన్ఫ్రా, డిజిటల్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమని అన్నారు. 2014-19 మధ్య ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.