వాటి జోలికి వెళ్లవద్దు…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్ జూలై 28 : దేశంలోని చట్టాలను గౌరవిస్తూ, దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆవులను వధించకూడదని, ప్రభుత్వం
నిషేధం విధించినపుడు, నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించకూడదని రేకుర్తి మదర్సా అరబియా హిప్జుల్ ఖురాన్ ప్రిన్సిపాల్, మజ్లిస్ ఉల్ ఉలమా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముఫ్తి మొహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ యావత్తు ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. ఆదివారం ముఫ్తి ఘియాస్ కరీంనగర్ లో మాట్లాడుతూ పవిత్ర బక్రీద్ మాసం రాబోవుతుందని, బక్రీద్ మాసంలో ఖుర్భానీ (బలి) ఇచ్చే జంతువుల్లో ఆవులను వధించకూడదని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. ఇటువంటి సున్నిత విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇస్లాం ధర్మం ప్రకారం మనం చేసే, నిర్వహించే పనులు, కార్యాలు, కార్యక్రమాలతో సమాజంలో నివసించే తోటి ప్రజల మనోభావాలకు ఇబ్బంది కలుగకుండా ఉండాలని, ఆవిధంగా మెదలాలని, జీవించాలని మహానీయ మొహమ్మద్ ప్రవక్త (సల్లం) సెలవిచ్చారని పేర్కొన్నారు. ఇస్లాం సంస్కృతి, సాంప్రదాయలకు పెట్టింది పేరని, అందుకు విరుద్ధంగా ప్రవర్తించడానికి వీలు లేదన్నారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ కలిమ్ షరీఫ్, షేఖ్ అహ్మద్ నియాజి, మొహమ్మద్ రఫీ, ఘుఫ్రాన్, ముఖరం, తౌహీద్, రాఫె, ఫరీద్ తదితరులు ఉన్నారు.