మా ఊరికి రావద్దు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 24: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న దరిమిలా కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు మా ఊరికి రావద్దంటూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. అంతేకాకుండా గ్రామాల ప్రవేశ ద్వారాలు, సరిహద్దుల్లో అడ్డుగా కట్టెలు, ముళ్ళకంచెలు, బారీకేడ్లు అడ్డుగా పెట్టి దారులను దిగ్బంధించారు. అలాగే మా గ్రామాల్లోకి ఏవరూ రావద్దంటూ సరిహద్దుల్లో ప్లేక్సీలు, ప్లేకార్డులు ఉంచారు. గ్రామ ప్రజలు గ్రామాన్ని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్ళవద్దంటూ కూడా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పలు పంచాయతీలు తీర్మాణాలు చేశారు. కరీంనగర్ నగరంలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మంగళవారం నగరంలో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల ప్రజలకు ఉచితంగా ఆరుకిలోల వివిధ రకాల కూరగాయలను మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరిగి అందజేశారు. 4వేల ఇళ్లల్లో కూరగాయలు అందించారు. కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె శశాంక, పోలీసు కమీషనర్ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ వల్లూరి క్రాంతి, మేయర్ సునీల్ రావు తదితరులు పర్యవేక్షించారు. అలాగే వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్ళి స్క్రీనింగ్ చేశారు. సానిటేషన్ చర్యలు విస్తృతంగా చేపట్టారు.