వాటి పేర్లు మారనున్నాయి…?
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్: ఓరుగల్లు జిల్లాల నామ స్వరూపాలు మారనున్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కూర్పు, పేర్లను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మార్చబోతోంది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ రెండు జిల్లాలను మళ్లీ పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా, వేగంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్వహించి వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలతో సహా రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 10 నుంచి 31కు పెరిగింది. ఇటీవల కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది. అయితే స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను మళ్లీ పునర్విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ తూర్పు, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ప్రజలు తమకు వరంగల్ రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ యధాతధంగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.