హమ్మయ్యా…శుభవార్త విన్నారు…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 24: వేసవి తీవ్రతకు ఉక్కిరిబిక్కిరై పోతున్న ప్రజలకి రుతుపవనాల తొలకరి జల్లులు సేదదీర్చి ఉపశమనం కలిగించినట్లుగా, సమాజ రక్షణ లో శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తూ ఆరోగ్యాలను పణంగా పెట్టి కుటుంబాల ఆలనాపాలన సైతం చూసుకోకుండా, ఎంతో ఒత్తిడికి గురవుతూ 24 గంటలు పనిచేసి అలసిపోయే పోలీసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్) నకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ మేరకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సోమవారం నుంచి వారాంతపు సెలవు ప్రక్రియ అమలు కు సీపీ కమలాసన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పాత కాలపు జాడ్యాలను, సాంప్రదాయాలను వదిలించుకొని ఆధునికత సంతరించుకుని ముందుకు సాగుతున్న పోలీసులకు 24 గంటల పని ఒత్తిడితో విపరీతమైన శ్రమకు గురై అలసిసొలసి అనారోగ్యం బాట పడుతున్నారు. అంతేకాకుండా 24 గంటలు విధి నిర్వహణతో మునిగిపోయిన పోలీసులు కుటుంబ ఆలనాపాలన, పిల్లల భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడం వలన పోలీసు సిబ్బంది కుటుంబాల్లో సైతం అసంతృప్తికి ఎంతోకాలంగా నెలకొని ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని అంశాల్లో ముందు వరుసలో ఉంటున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి చొరవ తో పోలీసులకి వారాంతపు సెలవులు అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం పోలీస్ వర్గాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు కూడా సిపికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం సురేందర్ , ప్రధాన కార్యదర్శి తులా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి ని కలిసి పుష్ప గుచ్చం అందించి కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు.