ఈసారి కిక్కు లేదు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 23: వైన్స్ షాపుల యజమానులకు హడావుడి తప్పింది. ప్రతిసారి మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు నానా పాట్లు, ప్రయత్నాలు చేసేవారు. మరో ఏడాది వరకు వారికి అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల గడువును పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈనెల 30తో షాపుల లైసెన్సుల గడువు ముగియనుంది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ ద్వారా మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటికే నూతన మద్యం విధానంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించారు. అన్ని రకాల పరిశీలన చేసిన అనంతరం 2019 అక్టోబర్ 1నుంచి 2020 సెప్టెంబర్ చివరి వరకు యధాతథంగా మద్యం దుకాణాల లైసెన్సులను పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యం దుకాణాల యజమానులకు హడావుడి తప్పి, ఊరట లభించినట్లయింది.