సరికొత్త వివాదంలో కేసీఆర్ సర్కార్..!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఓ వైపు పార్టీలోని కొందరు నేతలు చేస్తున్న అసహన వ్యాఖ్యలు తలనొప్పిగా మారగా, మరోవైపు రాష్ట్రంలో సరికొత్త వివాదానికి తెరలేసింది. యాదాద్రి
లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాకారంలోని మండప రాతి స్తంభాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తులను చెక్కించడం వివాదానికి దారితీసింది. దీనిపై హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు ప్రతి స్పందించడంతో వివాదస్పదమవుతోంది. అయితే, అలాంటిదేమి లేదని, అన్ని చిత్రాలు ఉన్నాయంటూ ఆలయ నిర్మాణ ప్రతినిధులు ప్రకటించారు. కేసీఆర్ సీఎం అయ్యాక యాదగిరిగుట్ట అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారనడంలో ఏలాంటి సందేహం లేదు. గతంలో ఏ పాలకుడు చూపనంత శ్రద్ధ కేసీఆర్ ఆలయంపై చూపిస్తూ, ఏకంగా వందల కోట్ల బడ్జెట్ కేటాయించారు. చిన్న జీయర్ స్వామి సూచనలతో ఎప్పటికప్పుడు కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. అయితే, యాదాద్రి ఆలయ రాతి స్తంభాలపై కేసీఆర్ చిత్రం, పార్టీ కారు గుర్తుతో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన చిత్రాలను చెక్కించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ప్రజల జీవన విధానాలను రాతి స్తంభాలపై నిక్షిప్తం చేయడం కొంతవరకు సబబే కానీ కేసీఆర్ చిత్రం, ఆయన పార్టీ కారు గుర్తు చెక్కడం విమర్శలకు దారితీసింది. దీనిపై హిందూ సంఘాలు, బిజెపి, కాంగ్రెస్ నాయకులు ప్రతి స్పందించారు. బిజెపి శ్రేణులు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ కారు గుర్తు చిత్రాలు తొలగించకపోతే కరసేవ తప్పదని హెచ్చరించారు. దీనిపై బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం తొలగించకపోతే ప్రజలతో కలిసి తొలగిస్తామని హెచ్చరించారు. ఎంతో ప్రాశాస్త్రం ఉన్న యాదాద్రిని అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత అని, అంతమాత్రాన అక్కడి స్తంభాలపై ముఖ్యమంత్రి, ఆయన పాలనను చెక్కించడం ఆలయాన్ని అపవిత్రం చేసినట్లేనని అన్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. ఈ క్రమంలో కేసీఆర్ ఏలాంటి ప్రకటన చేయలేదు. ఆలయ నిర్మాణ ప్రతినిధులు మాత్రం అలాంటిదేమి లేదంటూ ప్రకటించారు. ఏదిఏమైనా ఓ వైపు పార్టీలోని కొందరు నేతలు చేస్తున్న అసహన వ్యాఖ్యలు తలనొప్పిగా మారగా, మరోవైపు కేసీఆర్ సర్కార్ సరికొత్త వివాదంలో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది.