కర్నాటకలో కమల వికాసం….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
బెంగుళూరు, జూలై 29: గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన కర్నాటక రాజకీయాలకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. అనేక మలుపులు తిరిగి చివరకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కర్నాటకలో కొలువుదీరింది. సోమవారం కర్నాటక అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో యడ్యూరప్ప నెగ్గారు. 105 మంది బీజేపీ సభ్యులతోపాటు, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో బీజేపీ బలం 106కు చేరింది. వాస్తవానికి 225 మంది సభ్యులుండగా, 17మందిపై అనర్హత వేటు పడటంతో మొత్తం సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 104. బీజేపీకి 105మంది సభ్యుల బలం ఉండగా, ప్రతిపక్ష కూటమికి 99మంది మద్దతు ఉంది. దీంతో సునాయాసంగా యడ్యూరప్ప విజయం సాధించారు. కాగా, బల పరీక్ష ముగిసిన అనంతరం అసెంబ్లీ స్పీకర్ పదవికి రమేశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సభలో చదివి వినిపించారు. రమేశ్ కుమార్ స్పీకర్ పదవిలో 14 నెలల 4 రోజుల పాటు కొనసాగారు. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో రమేశ్ కుమార్ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకుని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి పని చేశాను అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. స్పీకర్ పదవి వరించడం తన అదృష్టమన్నారు. ఈ చైర్కు ఎలాంటి అపఖ్యాతి తీసుకురాకుండా ప్రవర్తించాలన్నారు. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనను స్పీకర్గా నియమించాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అడిగారు. వారి కోరిక మేరకు తాను స్పీకర్ పదవి చేపట్టేందుకు అంగీకరించానని రమేశ్ కుమార్ గుర్తు చేశారు. సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీడియాకు కూడా ధన్యవాదాలు చెబుతున్నట్లు రమేశ్ కుమార్ ప్రకటించారు.