JMS News Today

For Complete News

ఆ కోటాలోకి యోగా…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, సెప్టెంబర్ 23: మానసిక ప్రశాంతతతో పాటు మంచి వ్యాయామం అందిస్తూ ప్రతి వ్యక్తిలో జాతీయత, ఐక్యత భావాన్ని ఆవిష్కరించే యోగాపై అపార అభిమానం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన స్పోర్ట్స్ కోటాలో యోగాకు చోటు కల్పించారని రాష్ట్ర యోగా సంఘం ప్యాట్రన్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర, కరీంనగర్ జిల్లా యోగా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రవీందర్ సింగ్ మాట్లాడారు. దాదాపు 5000 ఏళ్ళ క్రితం చరిత్ర కలిగిన యోగ శాస్త్రం ప్రపంచానికి భారతీయులు అందించిన అద్భుతమైన కానుక అని అన్నారు. వ్యక్తుల్లో నిగ్రహాన్ని పెంచుతూ మనిషి, ప్రకృతి మధ్య సామరస్యాన్ని పొందుతూ, శరీరం మనసులను ఏకం చేసే సులక్షణమైన ఆలోచనలను యోగా అందిస్తోందన్నారు. ఇంతటి ప్రాముఖ్యం, ప్రాధాన్యతను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక‌మైన యోగాను ముందు తరాల వారికి అందించాలనే లక్ష్యంతో, యోగా క్రీడాకారుల సంక్షేమాన్ని గుర్తెరిగి బంగారు క్రీడా తెలంగాణ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాపరమైన ప్రోఫెషనల్ కోర్సులలో స్పోర్ట్స్ కోటాలో యోగాను చేర్చి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని అమలుకై ప్రత్యేకంగా జీవో నెంబర్ 2ను విడుదల చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ పక్షాన కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తున్న సందర్భంలో క్రీడా రంగాన్ని కూడా గణనీయమైన అభివృద్ధి చేసేందుకై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక స్పోర్ట్స్ కోటా తీసుకొచ్చిందన్నారు. గత రెండేళ్లుగా ప్రొఫెషనల్ కోర్సులో క్రీడా కోటాను హైకోర్టు ఉత్తర్వులతో నిలుపదల చేశారని, దీంతో గత రెండేళ్లుగా ప్రతిభావంతులైన క్రీడాకారులు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఐఐటి, ఎంబీఏ, ఎంసీఏ, బిఎడ్, పాలీసెట్ తదితర ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి స్పోర్ట్స్ కోటా అమలు కాకపోవడంతో క్రీడాకారులు నష్టం పోవడంతో వారి సాదకబాధలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి స్పోర్ట్స్ కోటాను పునరుద్ధరిస్తూ అదనంగా యోగా క్రీడాంశాన్పి చేర్చడం సంతోషదాయకమన్నారు. విద్యాపరంగా భవిష్యత్తులో యోగా క్రీడాకారులు ఉన్నత చదువులతో ఉజ్వల భవిష్యత్తు ఏర్పడడమేగాకుండా యోగాలో పరిశోధనలు చేసేందుకు ఈ జీవో ఎంతగానో తోడ్పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి మంచి చదువులతో పాటు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. యోగాను స్పోర్ట్స్ కోటాలో చేర్చే విషయమై తెలంగాణ ఆవిర్భావం ముందు నుంచి కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర యోగా సంఘం కోశాధికారి ఎన్.సిద్ధారెడ్డి, జిల్లా క్రీడలు, యువజన అధికారి కె.రాజవీరు, జిల్లా యోగా సంఘం బాధ్యులు సంపత్ కు‌మార్, ప్రదీప్ కిష్టయ్య , మల్లేశ్వరి, తెరాస నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *