విషాద ఘటన…జంట ఆత్మహత్య
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ఆదిలాబాద్, మే 8: లాక్ డౌన్ నేపథ్యంలో వారి వివాహం వాయిదా పడుతూ వస్తోంది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడగిస్తూ వస్తుండటంతో ఇక తమ పెళ్ళి జరగదని భావించిన ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కన్నాపూర్కు చెందిన గణేశ్, కంపూర్కు చెందిన సీతాబాయి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. కలిసి జీవితాంతం బతకాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకుని నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ, విధి వారిని వెక్కిరించింది. కరోనా నేపథ్యంలో పెళ్లి వాయిదా పడింది. ఇక తమ పెళ్లి జరగదని భావించి ఆ యువతీ యువకులు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కంపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.