ఐదేళ్ళలో రూ.48.77 కోట్ల అభివృద్ధి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 28: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఐదేళ్ళ కాలంలో రూ.48.77 కోట్లతో గ్రామాల్లో 2282 వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ ఐదేళ్ళ కాలంలో అందరి సహకారంతో పాలన అందించడం జరిగిందని తెలిపారు. తక్కువ నిధులు వచ్చినా…వాటితోనే ప్రాధాన్యత క్రమం లో గ్రామాల్లో అభివృద్ధి చేసినట్లు వివరించారు. అలాగే జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో అనేక సామాజిక, సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఏటా డైరీ ని విడుదల చేశామని, అలాగే ప్రతి ఏటా జడ్పీ కార్యక్రమాలపై బుక్ ను విడుదల చేసినట్టు తెలిపారు. జిల్లా పరిషత్ ఒక పరిపాలనా కేంద్రమే కాదు తెలంగాణ సాంస్కృతిక చైతన్య కేంద్రంగా విలసిల్లిందని చెప్పారు. కేరళ పంచాయితీ రాజ్ వ్యవస్థ పరిశీలనకు జడ్పీటీసీ సభ్యులతో అధ్యయన యాత్ర చేశామని తెలిపారు. తమ పాలనా కాలంలో సహకరించిన అందరికీ కృతఙ్ఞతలు చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు శరత్ రావు, కరుణాకర్, వీర్ల కవిత, మంజుల తదితరులు పాల్గొన్నారు.